Tuesday, January 7, 2014

దేవుని సృష్టి ఆరు రోజుల్లోనే పూర్తి కాలేదు!


''ఆకాశమును, భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తానూ చేసిన తన పని యేడవదినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన పనియంతటి నుండి యేడవ దినమున విశ్రమించెను''. ఆది 2: 2-3

పై వాక్యాన్ని చదివిన పలువురు క్రైస్తవులు సృష్టి అంతా ఆరు రోజుల్లోనే పూర్తి అయ్యిందని భావిస్తున్నారు. బైబిలు చరిత్ర ప్రకారము ఆది పురుషుడైన ఆదాము నుంచి ఇప్పటి వరకు సుమారు 7,000 సంవత్సరాలు మాత్రమే. బైబిలు లేఖనాల ప్రకారము భూమిని, మనిషిని ఆరు రోజుల సృష్టి క్రమంలోనే దేవుడు సృష్టించెను కాబట్టి భూమి వయస్సు కూడా సుమారు 7,000 సంవత్సరములు మాత్రమే.
అయితే శాస్త్రవేత్తలు మాత్రం భూమి పుట్టి ఇప్పటికి సుమారు 450 కోట్ల సంవత్సరాలు అని, మానవ జాతి పుట్టి సుమారు లక్ష సంవత్సరాలని చెబుతున్నారు. కార్బన్ డేటింగ్ మొదలైన పలు విధాలైన శాస్త్రీయ పరిశోధనల అనంతరం విషయాన్ని వెల్లడించారు. వాస్తవానికి సృష్టిని ఆరు రోజుల్లోనే దేవుడు పూర్తి చేయలేదు. బైబిలు లేఖనాల్లో దాగున్న నిగూఢతను గ్రహించగలిగితే సత్యం బోధపడుతుంది.

ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను! ఆది 1: 1

'ఆది' అనే ఒక్క పదముతోనే సృష్టి చాలా పురాతనమైనదని చెప్పబడినది. 'ఆది' అనేది ఎప్పుడని కచ్చితముగా చెప్పటానికి నరుడికి జ్ఞానము చాలనప్పటికీ అది శాస్త్రవేత్తల పరిశోధనలకు అనువుగానే ఉందని బైబిలు లేఖనాలు ద్వారానే నిరూపించవచ్చును.

అది ఎలాగో చూద్దాం!

భూమి తన చుట్టు తాను ఒకసారి పూర్తిగా తిరిగితే ఒక రోజు, భూమి చుట్టూ చంద్రుడు ఒక్కసారి పూర్తిగా తిరిగితే నెల రోజులు, సూర్యుని చుట్టు భూమి ఒక్కసారి పూర్తిగా తిరిగితే ఒక సంవత్సర కాల ప్రమాణముగా భావిస్తున్నాము. ఇదే విషయాన్ని లేఖనము కూడా చెబుతుంది చూడండి...

"దేవుడు- పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను. ప్రకారమాయెను. దేవుడు రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును, పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను." ఆది 1: 14-16

పై వాక్యమును బట్టి సృష్టి కల్పనలో నాలుగవ దినము వరకు సూర్య చంద్రులు సృజింపబడలేదని తెలుస్తుంది. అయితే మొదటి రోజే వెలుగు, చీకటి ఉన్నాయని, అస్తమయము, చీకటి కలిగిందని, దాని ఆధారంగానే ఒక దినము అయ్యిందని లేఖనాలు సూచిస్తున్నాయి. అందుకు కింది లేఖనాలను పరిశీలించండి...

"దేవుడు - వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడుకు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును, ఉదయమును కలుగగా ఒక దినమాయెను" ఆది 1: 3-5

పై వాక్యములో పేర్కొన్న దిన ప్రమాణము కచ్చితముగా 24 గంటలు ఉండే మానవ ప్రమాణము కాదనే విషయం స్పష్టమవుతుంది. మరి ప్రమాణం ఎవరిదంటే కచ్చితముగా అది దేవునికి సంబందించినదే.

దేవునికి ఒక దిన కాల ప్రమాణము ఎంత?

దేవుడు సృజించిన విశ్వములో జీవి ఉనికి ఉన్న సౌర కుటుంబములో భూమిపైన ఒక దిన ప్రమాణము 24 గంటలుగా ఉండగా ఇదే బుధ గ్రహముపైన 59 రోజులు, శుక్ర గ్రహముపైన 243 రోజులుగా ఉంది. అంటే, మనకు 59 రోజులు అయితే బుధగ్రహంపైన ఒక రోజుతో సమానము. అలాగే మనకు 243 రోజులైతే శుక్ర గ్రహంపైన ఒక రోజుతో సమానము. మరి విశ్వాన్ని సృజించిన దేవుని కాల ప్రమాణము కచ్చితంగా మానవుని దిన ప్రమాణము కన్నా ఎంతో శ్రేష్ఠమైనదిగా ఉండాలి. ఇదే విషయాన్ని లేఖనాలు వెల్లడిస్తున్నాయి.

"నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి. రాత్రి యందలి యొక జాము వలె నున్నవి." కీర్తనలు 90: 4

దేవుని దృష్టికి వేయి సంవత్సరములు ఒక రోజుగా మరియు ఒక జాము ( గంటలు) వలె ఉన్నాయని చెప్పటం ద్వారానే మానవుడి వేలాది సంవత్సరాలు దేవుడికి ఒక్క రోజుతో సమానమని అర్థమవుతుంది. అంటే, సృష్టి జరిగిన ఒక రోజు ప్రమాణము మానవుడికి వేలాది సంవత్సరాలతో సమానమని గ్రహించవచ్చు.

No comments:

Post a Comment