Monday, January 6, 2014

బైబిలు ఆధారిత గ్రంథముల మూల ప్రతులు ఇంకా ఉన్నాయా?



ఆయా కాలముల్లో రాయబడిన గ్రంథముల సంకలనముతో నేటి బైబిలునకు తుది రూపము వచ్చియున్నదని తొలి వ్యాసములో తెలుసుకున్నాము. బైబిలునకు ఆధారితమైన గ్రంథముల మూలప్రతులు ఇంకా ఉన్నాయా? అనే విషయమును తెలుసుకొనుటకు ముందుగా లేఖనములు ఎలా రాయబడినవి? లేఖనములను ఎలా పరిరక్షించారు? అనే విషయములను తెలుసుకొనెదము.

బైబిలు ఆధారిత గ్రంథములు వ్రాయుటకు ఉపయోగించిన సాధనములు ఇప్పటి వలే పూర్వకాలములో కాగితము లేదు కనుక ప్రజలు రెల్లు దుబ్బలను అట్టలుగా రూపొందించి మరియు పవిత్ర జంతు చర్మములను ఎండబెట్టి వాటిపైన లిఖించేవారు. బైబిలు ఆధారిత గ్రంథములను కూడ ఇదే విధముగా లిఖించియున్నారు. ఇలా రాసిన ఒక్కొక్క గ్రంథమును ఒక్కొక్క కఱ్ఱకు చుట్టబడి లేదా చుట్టలుగా చుట్టబడి యుంచెడివారు. వీటికి నకళ్లను తయారు చేయాలంటే మళ్లీ విషయాన్ని అంతటిని చేతితోనే వ్రాయవలసి ఉండేది. ప్రక్రియ చాలా కష్టము మరియు సమయముతో కూడుకున్నది.


పురాతన లేఖనముల పరిరక్షణ విధానము

బైబిలు ఆధారిత గ్రంథములు చాలా తక్కువ సంఖ్యలోనే ఉండటంతో పాటు అవి కూడ ధనికులు మరియు యూదుల సమాజ మందిరాల్లో మాత్రమే ఉండేవి. గ్రంథపు చుట్టలు పాతబడి జీర్ణావస్థకు చేరేటప్పటికీ వాటికి నకళ్లను వ్రాసె పనిలో నిమగ్నమయ్యేవారు. పాతగిలిన గ్రంథముల్లోని విషయమును పొల్లుపోకుండ అతి జాగ్రత్తతో నకళ్లను వ్రాసెడివారు. ఒక్కొక్క మాటను వ్రాయడానికి ముందు మూల ప్రతిలోని మాటను బాగుగా పలికి పొరపాట్లు లేకుండ అక్షరములను వ్రాసెడివారు. ఇలా ఒక గ్రంథమంతయు వ్రాసిన పిమ్మట అందులోని పొరపాట్లను నిర్ధారించడం కోసము మూల ప్రతితో సరిపోల్చి చూసేవారు. ఎలాంటి అక్షర దోషములు లేకపోతే కొత్త ప్రతిని ఉపయోగములోనికి తెచ్చెడివారు. వ్రాయబడిన ప్రతిలో చిన్న పొరపాటు ఉందని గుర్తిస్తే వాటిని కాల్చివేసి మళ్లీ మరొక ప్రతిని తయారుచేసే పనిలో నిమగ్నమయ్యేవారు. అందువలననే ఇతర గ్రంథములు కాలక్రమములో విషయపరంగా పలు మార్పులకు గురైనప్పటికీ బైబిలు ఆధారిత గ్రంథముల యొక్క జీవార్థము మాత్రము కొంచెమైనను కోల్పోకుండ మిగిలియున్నవి.


రచయితలు రాసిన మూలప్రతులు ఇంకా ఉన్నాయా?


పాత నిబంధన కాలము నాటి రచయితలు రాసిన గ్రంథముల మూలప్రతులు ఇంకా ఉండటానికి అవకాశములు లేవు. ఎందుకంటే పాతగిలిన గ్రంథములకు ఎప్పటికప్పుడు కొత్త ప్రతులు చేరుతుండేవి. ఇలా తిరగరాయబడిన గ్రంథముల యొక్క పురాతన ప్రతులు మాత్రము కొన్ని నేటికి ఉన్నాయి. వాటిని యెరూషలేము, లండన్, ప్యారీస్, డబ్లిన్, న్యూయార్క్, షికాగో, ఫిలదెల్పియా, యాన్ యార్బన్, మిషిగాన్ తదితర ప్రాంతాల్లోని పురావస్తు ప్రదర్శనశాలలో భద్రపరిచారు.

No comments:

Post a Comment