Tuesday, January 21, 2014

హెబ్రీ లేఖనములను గ్రీకు భాషాంతరము చేయబడిన ప్రక్రియ ఎలాంటిది?



క్రీస్తు పూర్వము 3 శతాబ్ధములో గ్రీకు భాష మాట్లాడే ప్రాంతాల్లో నివసించే యూదుల సౌలభ్యము కొరకు పాత నిబంధన లేఖనములను హెబ్రీ భాష నుంచి గ్రీకు భాషలోనికి తర్జుమా చేయడంతో అనువాదమునకు నాందిపడినట్లయినది. అనువాదము జరిగిన విధానమును క్రీస్తు పూర్వము 2 శతాబ్దమునకు చెందిన అరిస్టియస్ అనే వ్యక్తి తన సోదరుడైన ఫిలోక్రేట్స్ కు రాసిన లేఖ తెలియజేస్తుంది. అరిస్టియస్ చేత రాయబడిన లేఖ కావడంతో దానిని అరిస్టియస్ లేఖగా పేర్కొంటున్నారు.

అరిస్టియస్ లేఖ ప్రకారము:

"క్రీస్తు పూర్వము 281_246 సంవత్సరముల మధ్య ఐగుప్తును పరిపాలించిన రెండవ టాలోమి ఫిలడల్ఫస్ ప్రపంచ విఖ్యాతి గాంచిన అలెగ్జాండ్రియా పట్టణములోని గ్రంథాలయములో యూదు (ఇప్పటి పాత నిబంధన) లేఖన ప్రతులను కూడ ఉంచాలని భావించియున్నాడు. నిమిత్తము యెరూషలేములోని ప్రధాన యాజకుడైన ఏలియెజరును సంప్రదించియున్నాడు. ఆయన ఇశ్రాయేలీయుల్లోని ఒక్కొక్క గోత్రమునకు ఆరుగురు యూదు పండితుల చొప్పున 12 గోత్రములకు 72 మందిని ఎన్నుకొని వారిని రాజు వద్దకు పంపియున్నాడు. అక్కడ వారికి యూదు లేఖనములను హెబ్రీ భాష నుంచి గ్రీకు భాషలోనికి అనువదించు బాధ్యతలు అప్పగింపబడినవి. ఒక్కొక్కరికి ఒక్కోక్కటి చొప్పున 72 మంది యూదు పండితులకు 72 ప్రత్యేక గదులను రాజు కేటాయించెను. అనువాద ప్రక్రియ ముగిసే వరకు ఒకరతో నొకరు మాట్లాడుకొనకూడదని నిబంధన పండితులకు నిబంధన విధించబడెను. అదే విధముగా యూదు పండితులు 72 రోజుల్లో తమ అనువాద ప్రక్రియను పూర్తి చేసియున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరందరి అనువాదములు ఒకే విధముగా ఉండటం. అందువలన అనువాద ప్రక్రియ దైవావేశముతో వ్రాయబడినట్లు విశ్వసించియున్నారు." గాథనే క్రీస్తు పూర్వము 20 సంవత్సరము మరియు క్రీస్తు శకము 50 సంవత్సరము మధ్యకాలములో నివసించిన ఫిలో అను యూదు తత్త్వవేత్త మరియు క్రీస్తు శకము 37_100 మధ్యకాలములో నివసించిన యోసఫస్ అనే యూదు చారిత్రకారుడు సైతము విశ్వసించియున్నారు. అయితే 72 మంది యూదు పండితుల సంఖ్యను మాత్రము యోసఫస్ యూదు చారిత్రకారుడు 70గా విశ్వసించియున్నాడు. పూర్వ కాలములో యూదులు మరియు గ్రీకుల యొక్క విద్యానాగరికత కేంద్రముగా ప్రసిద్ధి గాంచిన అలెగ్జాండ్రియా పట్టణములో తర్జుమా జరిగినట్లు విశ్వసిస్తున్నారు.

అరిస్టియస్ లేఖ సారాంశముపై విమర్శలు 

అరిస్టియస్ లేఖలోని గాథ కల్పన మాత్రమే అనే విమర్శలు ఉన్నాయి. చారిత్రక అధ్యాయనము ద్వారా పాత నిబంధన లేఖనములను క్రీస్తు పూర్వము 3 శతాబ్దము నుంచి క్రీస్తుపూర్వము 1 శతాబ్దము మధ్యకాలముల్లో గ్రీకు భాషలోకి అనువదించినట్లు చారిత్రకారులు విశ్వసిస్తున్నారు. క్రీస్తు పూర్వము 3 శతాబ్దములో తోరా (పంచకాండములు), క్రీస్తు పూర్వము 185 సంవత్సర కాలములో కీర్తనల గ్రంథము, తరువాత యెహెజ్కేలు మరియు 12 మంది చిన్న ప్రవక్తలుగా పిలువబడిన హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహుము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ గ్రంథములను, తరువాత చారిత్రక గ్రంథములైన యెహోషువ, న్యాయాధిపతులు, 1,2 సమూయేలు, 1,2 రాజులు, 1,2 దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, గ్రంథములను, చివరగా యెషయా గ్రంథమును, క్రీస్తు పూర్వము 150 సంవత్సరములో దానియేలు, యోబు, క్రీస్తు పూర్వము 1 శతాబ్ధములో పరమగీతము, విలాపవాక్యములు, రూతు, ఎస్తేరు తదితర గ్రంథములను అనువదించియుండవచ్చని భావిస్తున్నారు.

సెప్టువజింటు 

పాత నిబంధన లేఖనములను హెబ్రీ భాష నుంచి గ్రీకు భాషలోనికి అనువదించిన యూదు పండితులను 'సెప్టువజింటు' అను పేరుతో వ్యవహరిస్తున్నారు. లాటిన్ భాషా యందు "సెప్టువజింట' అనగా 70 అని అర్థము. పాత నిబంధన లేఖనములను గ్రీకు భాషలోకి అనువదించిన యూదు పండితుల సంఖ్య 70గా విశ్వసించడంతో అనువాదకర్తలను 'సెప్టువజింటు' గా వ్యవహరిస్తున్నారు. సెప్టువజింట అనే లాటిన్ పదమును సంఖ్యారూపములో రోమన్ అంకెలను ఉపయోగించి LXX తో సూచిస్తారు.

No comments:

Post a Comment