Monday, January 6, 2014

బైబిలు రూపము ఎలా వచ్చింది?



బైబిలు అనేది ఒకే వ్యక్తి రాసినది కాదు. ఇది, సుమారు 1500 సంవత్సరముల మధ్యకాలములో వివిధ కాలములకు, వివిధ ప్రాంతములకు చెందిన వేర్వేరు వ్యక్తులు రాసిన చారిత్రక సంఘటనలు, మరియు ప్రవచనముల సమాహారము. వాటిని వాటి కాలముల ఆధారముగా ఒక క్రమపద్ధతిలో కూర్చడం ద్వారా నేటి బైబిలుకు తుది రూపం ఏర్పడినది. పుస్తకములు అనే అర్థమునిచ్చే బిబ్లియా అనే గ్రీకు పదము నుంచి బైబిలు అనే పదము వచ్చినది. క్రీస్తుకు ముందు వరకు ఉన్న చరిత్రను పాత నిబంధన గ్రంథము అని, క్రీస్తు జననం మొదలుకొని జరిగిన సంఘటనలను కొత్త నిబంధన గ్రంథము అని బైబిలును రెండు ముఖ్య భాగములుగా విభజించియున్నారు. కొత్త నిబంధన గ్రంథములో తొలి పుస్తకమైన ఆదికాండము మొదలుకొని పాత నిబంధన గ్రంథములోని చివరి పుస్తకమైన ప్రకటనల గ్రంథము వరకు నిర్విరామముగా చదివితే అదంతా ఒకే వ్యక్తి రాశారనే భ్రమ కలుగుతుంది. ఎందుకంటే, బైబిలులోని విషయమంతా ఒకదానికి ఒకటి కచ్చితమైన సంబంధమును కలిగియుండటమే అందుకు ప్రధాన కారణము. క్రీస్తు ఆగమనము యొక్క ప్రవచనముగా పాత నిబంధన గ్రంథము ఉండగా ప్రవచనముల నెరవేర్పుగా కొత్త నిబంధన గ్రంథము ఉన్నది.

బైబిలులోని వృత్తాంతములను ఎలా గ్రంథస్థము చేశారు?


బైబిలు పుస్తకముల చరిత్రను గ్రంథస్థము చేసిన రచయితల్లో ప్రప్రథమముగా మోషే గారు కనిపిస్తారు. ఇశ్రాయేలీయులు 400 యేండ్లు ఐగుప్తులో బానిసత్వం అనుభవించిన తరువాత వారిని విముక్తులను చేసే సందర్భములో మోషేగారి ప్రస్థావన కనిపిస్తున్నది. అంటే ఐగుప్తీయుల బానిసత్వము నుంచి విముక్తి చేసినప్పటి నుంచి తన జీవితకాలము వరకు జరిగిన చరిత్రను మోషేగారు లిఖించియున్నారు. అలాంటప్పుడు విశ్వ ఆవిర్భవము మరియు తొలి మానవుడైన ఆదాము మొదలుకొని ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల వద్ధ బానిసలుగా ఉన్న సమయము వరకు జరిగిన చరిత్రను ఎవరు గ్రంథస్థము చేసియున్నారు? చరిత్రను రాయడానికి మోషేగారికి ఆధారములు ఎక్కడి నుంచి లభించియున్నవి అనే పలు అనుమానము కలుగుట సహజము.


మోషేగారి కాలమునకు కొన్ని శతాబ్ధముల ముందటి వరకు లిపి వాడుకలోకి రాలేదు. అంటే అప్పటి వరకు జరిగిన చరిత్రను ప్రజలు మౌఖికముగా కథలుగా చెప్పుకొనేవారు. ప్రతి తరములోని వ్యక్తులు తమ తరము యొక్క పితరులు మరియు తమ వంశావళుల గురించి ఇలా గాథలుగా చెప్పుకొనేవారు. వాటిని పారంపర్య గాథలు అని అంటారు. సుమారు క్రీస్తు పూర్వము 1800 శతాబ్ధములో పశ్చిమాసియా ప్రజలు లిపిని వాడుక చేసుకోవడం ప్రారంభించిన తరువాత కథలు గ్రంథస్థము చేయడం ప్రారంభమైనది. ఇందుకు 'పాపిరస్' అనే రెల్లు దుబ్బల నుంచి తయారుచేసిన అట్టలను వాడేవారు. పాపిరస్ అనే పదము నుంచే నేటి పేపరు అనే పదము పుట్టినది. తరువాత జంతు చర్మాలను ఎండబెట్టి వాటి మీద లిఖించడం మొదలుపెట్టారు. సృష్టి అవిర్భవము మొదలుకొని ఇశ్రాయేలీయుల బానిసత్వము వరకు ఉన్న చరిత్రను బహుశా ఇలాగే గ్రంథస్థము చేసియుండవచ్చును. అయితే వీటిలో పలు గాథలకు అతిశయోక్తులు మరియు కల్పనా కథలు చేరాయి. అయితే మోషేగారు లిఖించిన సృష్టి మరియు జీవ సృష్టి వివరాలు పరిశీలించినట్లయితే విజ్ఞానమునకు మాత్రము తీసిపోని విషయాలే కనిపిస్తాయి. దీనిని బట్టి మోషేగారు కేవలము దైవావేశము వలన మాత్రమే యధార్థ సంఘటనలను గ్రంథస్థము చేసియున్నారని విశ్వసించగలము.

No comments:

Post a Comment