Tuesday, January 21, 2014

హెబ్రీ లేఖనములను గ్రీకు భాషాంతరము చేయబడిన ప్రక్రియ ఎలాంటిది?



క్రీస్తు పూర్వము 3 శతాబ్ధములో గ్రీకు భాష మాట్లాడే ప్రాంతాల్లో నివసించే యూదుల సౌలభ్యము కొరకు పాత నిబంధన లేఖనములను హెబ్రీ భాష నుంచి గ్రీకు భాషలోనికి తర్జుమా చేయడంతో అనువాదమునకు నాందిపడినట్లయినది. అనువాదము జరిగిన విధానమును క్రీస్తు పూర్వము 2 శతాబ్దమునకు చెందిన అరిస్టియస్ అనే వ్యక్తి తన సోదరుడైన ఫిలోక్రేట్స్ కు రాసిన లేఖ తెలియజేస్తుంది. అరిస్టియస్ చేత రాయబడిన లేఖ కావడంతో దానిని అరిస్టియస్ లేఖగా పేర్కొంటున్నారు.

అరిస్టియస్ లేఖ ప్రకారము:

"క్రీస్తు పూర్వము 281_246 సంవత్సరముల మధ్య ఐగుప్తును పరిపాలించిన రెండవ టాలోమి ఫిలడల్ఫస్ ప్రపంచ విఖ్యాతి గాంచిన అలెగ్జాండ్రియా పట్టణములోని గ్రంథాలయములో యూదు (ఇప్పటి పాత నిబంధన) లేఖన ప్రతులను కూడ ఉంచాలని భావించియున్నాడు. నిమిత్తము యెరూషలేములోని ప్రధాన యాజకుడైన ఏలియెజరును సంప్రదించియున్నాడు. ఆయన ఇశ్రాయేలీయుల్లోని ఒక్కొక్క గోత్రమునకు ఆరుగురు యూదు పండితుల చొప్పున 12 గోత్రములకు 72 మందిని ఎన్నుకొని వారిని రాజు వద్దకు పంపియున్నాడు. అక్కడ వారికి యూదు లేఖనములను హెబ్రీ భాష నుంచి గ్రీకు భాషలోనికి అనువదించు బాధ్యతలు అప్పగింపబడినవి. ఒక్కొక్కరికి ఒక్కోక్కటి చొప్పున 72 మంది యూదు పండితులకు 72 ప్రత్యేక గదులను రాజు కేటాయించెను. అనువాద ప్రక్రియ ముగిసే వరకు ఒకరతో నొకరు మాట్లాడుకొనకూడదని నిబంధన పండితులకు నిబంధన విధించబడెను. అదే విధముగా యూదు పండితులు 72 రోజుల్లో తమ అనువాద ప్రక్రియను పూర్తి చేసియున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరందరి అనువాదములు ఒకే విధముగా ఉండటం. అందువలన అనువాద ప్రక్రియ దైవావేశముతో వ్రాయబడినట్లు విశ్వసించియున్నారు." గాథనే క్రీస్తు పూర్వము 20 సంవత్సరము మరియు క్రీస్తు శకము 50 సంవత్సరము మధ్యకాలములో నివసించిన ఫిలో అను యూదు తత్త్వవేత్త మరియు క్రీస్తు శకము 37_100 మధ్యకాలములో నివసించిన యోసఫస్ అనే యూదు చారిత్రకారుడు సైతము విశ్వసించియున్నారు. అయితే 72 మంది యూదు పండితుల సంఖ్యను మాత్రము యోసఫస్ యూదు చారిత్రకారుడు 70గా విశ్వసించియున్నాడు. పూర్వ కాలములో యూదులు మరియు గ్రీకుల యొక్క విద్యానాగరికత కేంద్రముగా ప్రసిద్ధి గాంచిన అలెగ్జాండ్రియా పట్టణములో తర్జుమా జరిగినట్లు విశ్వసిస్తున్నారు.

అరిస్టియస్ లేఖ సారాంశముపై విమర్శలు 

అరిస్టియస్ లేఖలోని గాథ కల్పన మాత్రమే అనే విమర్శలు ఉన్నాయి. చారిత్రక అధ్యాయనము ద్వారా పాత నిబంధన లేఖనములను క్రీస్తు పూర్వము 3 శతాబ్దము నుంచి క్రీస్తుపూర్వము 1 శతాబ్దము మధ్యకాలముల్లో గ్రీకు భాషలోకి అనువదించినట్లు చారిత్రకారులు విశ్వసిస్తున్నారు. క్రీస్తు పూర్వము 3 శతాబ్దములో తోరా (పంచకాండములు), క్రీస్తు పూర్వము 185 సంవత్సర కాలములో కీర్తనల గ్రంథము, తరువాత యెహెజ్కేలు మరియు 12 మంది చిన్న ప్రవక్తలుగా పిలువబడిన హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహుము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ గ్రంథములను, తరువాత చారిత్రక గ్రంథములైన యెహోషువ, న్యాయాధిపతులు, 1,2 సమూయేలు, 1,2 రాజులు, 1,2 దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, గ్రంథములను, చివరగా యెషయా గ్రంథమును, క్రీస్తు పూర్వము 150 సంవత్సరములో దానియేలు, యోబు, క్రీస్తు పూర్వము 1 శతాబ్ధములో పరమగీతము, విలాపవాక్యములు, రూతు, ఎస్తేరు తదితర గ్రంథములను అనువదించియుండవచ్చని భావిస్తున్నారు.

సెప్టువజింటు 

పాత నిబంధన లేఖనములను హెబ్రీ భాష నుంచి గ్రీకు భాషలోనికి అనువదించిన యూదు పండితులను 'సెప్టువజింటు' అను పేరుతో వ్యవహరిస్తున్నారు. లాటిన్ భాషా యందు "సెప్టువజింట' అనగా 70 అని అర్థము. పాత నిబంధన లేఖనములను గ్రీకు భాషలోకి అనువదించిన యూదు పండితుల సంఖ్య 70గా విశ్వసించడంతో అనువాదకర్తలను 'సెప్టువజింటు' గా వ్యవహరిస్తున్నారు. సెప్టువజింట అనే లాటిన్ పదమును సంఖ్యారూపములో రోమన్ అంకెలను ఉపయోగించి LXX తో సూచిస్తారు.

పాత నిబంధన లేఖనముల అనువాదమునకు కారణములేమి?




ఒక గ్రంథమును పరభాషీయులు సైతము చదవవలెయునంటే కచ్చితముగా గ్రంథమును సంబంధిత భాషలో అనువాదము చేయవలెను. పాత నిబంధన లేఖనముల విషయములోను జరిగినది.


హెబ్రీ భాష

అబ్రాహాము కనాను చేరుటకు మునుపు వరకు అరాము భాషను మాట్లాడువాడు. కనాను చేరిన పిమ్మట ఆయన హెబ్రీ భాషను అలవరచుకున్నాడు. అబ్రాము తరువాతి సంతతి సైతము హెబ్రీ భాషను తమ స్వంత భాషగా చేసుకున్నారు. అందువలనే యూదుల పవిత్ర లేఖనములైన పాత నిబంధన లేఖనములన్నీ ఆదిమ హెబ్రీ భాషలోనే వ్రాయబడినవి. క్రీస్తు పూర్వము 1450 సంవత్సరము వ్రాయబడిన పంచకాండములు మొదలుకొని క్రీస్తు పూర్వము 400 సంవత్సరములో వ్రాయబడిన మలాకీ గ్రంథము వరకు పాత నిబంధన లేఖనములన్నీఆదిమ హెబ్రీ భాషలోనే వ్రాయబడినవి.


హెబ్రీ భాషకు దూరమైన యూదులు


కాలక్రమములో యూదులు మాత్రము తమ స్వంత భాషకు దూరమైయ్యారు. యెరూషలేము నాశనమై యూదులు చెఱ నిమిత్తము బబులోనుకు కొనిపోబడిన కాలములో హెబ్రీ భాషకు భాషకు యూదులు దూరమైయ్యారు. బబులోనులో స్థానిక భాష అరాముగా ఉండటంతో పాటు అది హెబ్రీ భాషకు చాలా దగ్గర పోలికలు కలిగియుండటంతో యూదులు శీఘ్రముగా అరాముకు అలవాటుపడిపోయారు. కాలములోనే అరాము భాషను తమ స్వంత భాషగా చేసికొనియున్నారు. ఇలా పలు సంఘటనల కారణముగా కూడ యూదులు చెదరగొట్టబడి హెబ్రీ భాషకు దూరమైయ్యారు


యూదుల కొరకే తర్జుమా


పాత నిబంధన లేఖనముల కాలము సంపూర్తియైన క్రీస్తు పూర్వము 400 సంవత్సరముల నాటికి పలువురు యూదులు అప్పటి సామాన్య వాడుక భాషలో ఒకటిగా ఉన్న గ్రీకును తమ స్వంత భాషగా చేసికొనిరి. దీంతో తమ స్వంత దేవుని గురించి పవిత్ర లేఖనముల్లో చెప్పబడిన విషయములను గ్రహించలేని పరిస్థితి యూదులకు ఏర్పడినది. అందువలన గ్రీకు భాషను వాడుక భాషగా చేసుకున్న యూదులకు భాషలోనే తమ పవిత్ర లేఖనములను మరియు తమ నిజ దేవుని (యెహోవా) గురించి బోధింపవలెననే ఉద్దేశ్యముతో పాత నిబంధన లేఖనములను భాషలోనికి అనువదించడానికి అంకురార్పణ జరిగినది. క్రీస్తు పూర్వము 3 శతాబ్దములో యూదు పండితులు (రబ్బీయులు) పనులను చేపట్టియున్నారు. ప్రప్రథమముగా గ్రీకు భాషలో నాంది పలికిన పాత నిబంధన లేఖనముల తర్జుమా తర్వాతి కాలములో ప్రపంచములోని వివిధ భాషల్లోకి అనువదింపబడెను.