Monday, January 6, 2014

తొలినాళ్లలో పాత నిబంధన గ్రంథము యొక్క స్వరూపము

ప్రస్తుతము బైబిలునందు పాత నిబంధన గ్రంథము (యూదుల పవిత్ర లేఖనము) లో ఉన్న 39 పుస్తకములు సెప్టువజింటు భాషాంతరములో ఉన్నవే. క్రీస్తు పూర్వము 2 శతాబ్దము నాటికి హెబ్రీ భాష నుంచి గ్రీకు భాషలోనికి పుస్తకములన్నిటినీ అనువదించారు. అప్పట్లో వాటిని ఒకే గ్రంథముగా సంకలనము చేయబడలేదు. యూదుల పవిత్ర లేఖనముల్లో ఏయే గ్రంథములను ఏయే ఆధారముల ప్రకారము చేర్చియున్నారో చెప్పుటకు నిర్దుష్టమైన ఆధారములు లేవు. అయితే పాత నిబంధన గ్రంథములోని పుస్తకములను యేసు క్రీస్తు కాలములోనే మూడు ప్రత్యేక భాగములుగా వర్గీకరించియున్నట్లు, వర్గీకరణను యేసు క్రీస్తు సైతము సూచించినట్లు బైబిలు లేఖనము స్పష్టము చేయుచున్నది.

"అంతట ఆయన_మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నియు నేరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరివని వారితో చెప్పెను" లూకా 24 : 44.

పై వచనము యేసుక్రీస్తు పలికిన మాటలు. క్రీస్తు కాలములో పాత నిబంధన గ్రంథమును ఒకే గ్రంథముగా కాకుండ మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథము, కీర్తనల గ్రంథములు అనే మూడు ప్రధాన భాగములుగా పరిగణించినట్లు వచనము ద్వారా గ్రహించవచ్చును. వర్గీకరణలో ఏయే గ్రంథములను సంకలనము చేసియున్నారో పరిశీలించెదము.

మోషే ధర్మశాస్త్రము: ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము అను అయిదు గ్రంథముల సంకలనమును మోషే ధర్మశాస్త్రముగా పిలుతురు. వీటిని మోషే గ్రంథస్థము చేసియున్నాడని విశ్వసించడం ద్వారా మరియు యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రమును ఆయన ఇశ్రాయేలీయులకు ఉపదేశించియున్నాడనే కారణము చేత అయిదు గ్రంథములను మోషే ధర్మశాస్త్రము అని పిలిచెదరు. వీటినే పంచ కాండములు అని కూడా అందురు.

ప్రవక్తల గ్రంథము: బైబిలునందు చరిత్ర గ్రంథములుగా పరిగణిస్తున్న వాటిలో యెహోషువ మొదలుకొని రెండవ రాజుల వరకు ఉన్న గ్రంథములు ప్రవక్తల వలన రచింపబడుటవలన వాటిని ప్రవక్తల గ్రంథము విభాగములో చేర్చియున్నారు. వీటితో పాటు 12 మంది చిన్న ప్రవక్తలు రచించిన హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహుము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ గ్రంథములను కూడ విభాగములో చేర్చియున్నారు.

కీర్తనల గ్రంథములు: కీర్తనలు, కావ్య గ్రంథములతో పాటు రూతు, విలాపవాక్యములు, దానియేలు, 1 దినవృత్తాంతములు మొదలుకొని ఎస్తేరు వరకును కీర్తనల గ్రంథములో చేర్చిరి.

తరువాతి కాలములో మూడు ప్రధాన భాగములను నాలుగు ప్రధాన భాగములుగా విభజించియున్నారు. అవి పంచకాండములు, చరిత్ర గ్రంథములు, కావ్య గ్రంథములు, ప్రవచన గ్రంథములు.

పంచకాండములు: మోషే ధర్మశాస్త్రమునే పంచకాండములు అని కూడా అందురు.
చరిత్ర గ్రంథములు: న్యాయాధిపతులు, రూతు, 1, 2 సమూయేలు, 1, 2 రాజులు, 1, 2 దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు.

కావ్య గ్రంథములు: యోబు, కీర్తనలు, సామితెలు, ప్రసంగి, పరమగీతము
ప్రవచన గ్రంథములు: ఇందులో గ్రంథములను పెద్ద ప్రవక్తలు మరియు చిన్న ప్రవక్తలు వ్రాసిన గ్రంథములుగా విభజించిరి. యెషయా, యిర్మీయా, విలాపవాఖ్యములు, యెహెజ్కేలు, దానియేలు అను అయిదు గ్రంథములు పెద్ద ప్రవక్తల గ్రంథములు అనియు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహుము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ గ్రంథములను చిన్న ప్రవక్తల గ్రంథములనియు అందురు.

పాత నిబంధన గ్రంథముల వర్గీకరణ సంఖ్య మారినప్పటికీ మొత్తము గ్రంథముల సంఖ్యలో మాత్రము ఎలాంటి మార్పులు చోటుచేసుకొనలేదు.

No comments:

Post a Comment